
ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఇచ్చోడ మండల కేంద్రంలోని రోడ్డు రవాణా సంస్థ ప్రయాణప్రాంగణ పరిస్థితి..రోడ్డు నిర్మాణం పుణ్యమా అని రెండు దశాబ్దాల అనంతరం ప్రయాణికులతో కళకళలాడిన బస్టాండ్ ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిగా బురదమయంగా మారి బస్టాండ్ ఆవరణలో కనీసం కాలు పెట్టలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడింది..బస్టాండ్ ను ప్రజలు పూర్తి స్థాయిలో వాడుకుంటున్నప్పటికి అధికారులు సకాలంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది.. ఆలస్యంగా అప్రమత్తమైన అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో బురద సమస్య రోజు రోజుకు మరింత జఠిలంగా మారుతుంది.. దీంతో ప్రయాణికులు నడి రోడ్డుపై బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది.. ఊరిలో వంతెనలా నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాన రహదారిగుండా బస్సులను పునరుద్దరించాలని డిమాండ్ పెరుగుతుంది..ఒకవేళ బస్సులు ప్రధాన రహదారి గుండా పునః ప్రారంభిస్తే బస్టాండ్ కు ఆదరణ తగ్గే అవకాశం ఉండడంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి…
కనీస వసతులు కరువు, అనాసక్తిలో జనాలు…
రోడ్డు నిర్మాణంలో భాగంగా వంతెనలా నిర్మాణం సంధర్భంగా ఇచ్చోడ గ్రామం మీదుగా కాకుండా బస్టాండ్ వరకే బస్సుల రాకపోకలను పరిమితం చేయడంతో ప్రయాణికులు తప్పనిసరిగా బస్టాండ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దాదాపు రెండు దశాబ్దాల తరువాత పాత బస్టాండ్ తిరిగి పూర్తి వినియోగంలోకి వచ్చింది.. కాస్త కష్టమవుతున్నప్పటికి పాత బస్టాండ్ తిరిగి వినియోగంలోకి రావడన్ని స్వాగతించారు గ్రామస్థులు..దూరభారం అవుతున్నప్పటికి వ్యయ, ప్రయాసలకొర్చి ఆదరించారు ప్రయాణికులు.. కాని ఆ మేరకు బస్టాండ్ లో కనీస వసతుల కల్పనలో అధికారులు విఫలం కావడంతో క్రమంగా బస్టాండ్ పట్ల ప్రయాణికులకు ఆదరణ తగ్గింది… రాత్రుళ్ళు చిమ్మ చీకటిగా ఉండడం, సరైన భద్రతా లేకపోవడం, కనీస వసతులు లేకపోవడం ప్రయాణికులకు అసౌకర్యన్నీ కలిగించింది.. ఈ నేపథ్యంలో తిరిగి ఇచ్చోడ ఊరు మీదుగా బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్ పెరిగింది.. దానికి తోడుగా బురద సమస్య మరీంత జఠిలంగా మారడంతో ఈ డిమాండ్ మరీంత ఊపందుకుంది.. ఇక ఊరిలో బస్సుల రాకపోకలను పునరుద్ధరిస్తే బస్టాండ్ ఆదరణ తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు అధికారులు..
ఆర్టీసీ మరియు ఆర్ అండ్ బి శాఖలు స్థలాల పరస్పర మార్పిడి…
అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు…ఇచ్చోడ నడిబొడ్డున ఉన్న ఆర్ అండ్ బి శాఖ స్థలాన్ని ఆర్టీసీ వినియోగించుకుంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్థులు అభిప్రాయ పడుతున్నారు.. ఆర్టీసీ మరియు ఆర్ అండ్ బి రెండు శాఖలు సమన్వయం చేసుకుని స్థలాల విస్తీర్ణం, విలువలను బేరీజు వేసుకుని పరస్పరం స్థలాల మార్పిడి చేపడితే అందరికి సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు స్థానికులు..

“ఇచ్చోడలో బస్టాండ్ పరిస్థితి దారుణంగా ఉంది.. కనీసం కాలు పెట్టలేనంత దుర్భరంగా ఉంది పరిస్థితి.. సమస్యను ముందస్తుగా గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు..బస్సులు ఊర్లోకి రాకపోవడం ఒక సమస్య అయితే బస్సులు ఊరిలోకి వస్తే బస్టాండ్ ఆదరణ తగ్గడం మరో సమస్య.. అయితే దీనికి శాశ్వత పరిష్కారంగా ఇచ్చోడ బస్టాండ్ ను ఊరి నడిబొడ్డున ఉన్న ఆర్ అండ్ బి ఖాళీ స్థలంలో ఏర్పాటు చెస్తే పూర్తిగా బస్టాండ్ వినియోగంలోకి వస్తుంది.. ఆర్టీసీ మరియు ఆర్ అండ్ బి శాఖలు తమ తమ స్థలాలను పరస్పరం బదిలీ చేసుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలి, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు త్వరలోనే గ్రామస్థులు సమావేశమై చర్చిస్తాం”- పెరుమండ్ల స్వామి, గ్రామస్థుడు, ఇచ్చోడ.
బస్టాండ్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం – ఆర్టీసీ డీఎం.
ప్రధాన రహదారి ఎత్తు పెరగడంతో బస్టాండ్ లో వర్షపు నీరు చేరి బురద సమస్య తీవ్రమవుతుంది,విరామం లేకుండా వర్షం కురుస్తుండడం పనులకు ఆటంకం కలిగిస్తుంది.. బస్టాండ్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం, నిధులు మంజూరు కాగానే సీసీ రోడ్డు పనులు పూర్తిచేస్తాం.. ఆర్ అండ్ బి అధికారులు, పోలీసులతో చర్చించి ఊరిలో నుండి బస్సులు నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటాము…ఇక గ్రామస్థుల నుండి ప్రతిపాదనలు వస్తే వారి సహకారంతో ఆర్ అండ్ బి స్థల బదిలీ విషయంపై సమీక్షిస్తామని తెలిపారు ఆర్టీసీ డీఎం ప్రతిమా రెడ్డి.
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.